'మీ ఓటు తీసేస్తాం - గ్రామంలో ఉంటున్నట్లు నిరూపించుకోండి' : బీఎల్ఓల నోటీసులపై మండిపడుతున్న ఓటర్లు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 21, 2023, 6:50 PM IST
Irregularities in Preparation of Voter List : రాష్ట్రంలో ఓటరు జాబితా రూపకల్పనలో అవకతవకలు రోజురోజుకి పెచ్చరిల్లుతున్నాయి. టీడీపీ సానుభూతిపరులని ఓటరు జాబితా నుంచి తమ పేరును తీసివేస్తున్నారని పలు జిల్లాల్లో ఓటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పల్నాడు జిల్లా పెదకూరపాడు తహశీల్ధారు కార్యాలయం వద్ద అత్తలూరు, ఉంగుటూరు గ్రామాల ఓటర్లు నిరసన చేపట్టారు. గ్రామంలో లేరని తమను ఓట్ల జాబితా నుంచి తొలగించినట్లు నోటీసులు పంపారని ఆందోళన నిర్వహించారు.
వైసీపీ నేతలు ఇచ్చిన జాబితా ఆధారంగా బీఎల్వో లు నోటీసులు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి, చదువుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లిన వారికి.. గ్రామంలో లేరన్న నేపంతో నోటీసులు ఇచ్చినట్లు స్థానికులు తెలియజేశారు. ఉంగుటూరు గ్రామంలో 83, అత్తలూరు గ్రామంలో 130 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ఓటరు జాబితా నుంచి తమ ఓట్లు తీసివేశారని.. ఎన్నికల నమోదు అధికారి దేశిరెడ్డి నాగజ్యోతికి ఓటర్లు ఫిర్యాదు చేశారు. తమ ఓటర్లును తిరిగి ఓటరు జాబితాలో చేర్చాలని వారు ఎన్నికల నమోదు అధికారిని కోరుకున్నారు.