ఫలించిన విద్యార్థుల ఆందోళన - గురుకుల పాఠశాలలో ఉన్నతాధికారుల విచారణ 'ఈటీవీ భారత్ ఎఫెక్ట్' - రంపచోడవరం మండలం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 22, 2023, 5:46 PM IST
Investigation Under the Direction of Gurukula Joint Secretary: అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలంలోని గిరిజన సంక్షేమ బాలికల పాఠశాలలో విద్యార్థుల ఆకలి కేకలు, ఇబ్బందులపై గురుకుల జాయింట్ సెక్రెటరి రమణమూర్తి బుధవారం విచారణ చేపట్టారు. మధ్యాహ్న భోజనంలో పురుగులు ఉంటున్నాయని, సరైన తాగు నీరు ఇవ్వడం లేదని.. ఈ నెల 20న (నవంబరు 20న) రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయం ఎదుట విద్యార్థులు ఆందోళన చేసిన విషయం అందరికి తెలిసిందే. ఈటీవీ భారత్లో వచ్చిన ఈ కథనానికి అధికారులు స్పందించారు.
రమణమూర్తి ఆధ్వర్యంలో అధికారుల బృందం పాఠశాలను సందర్శించి.. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిత్యవసర సరకులు ఉంచే గదిని పరిశీలించారు. విద్యార్థుల సమస్యలను పట్టించుకోని.. స్కూల్ ప్రిన్సిపల్ పార్వతిపై సమగ్ర విచారణ చేసి.. నివేదికను గురుకుల సెక్రటరీకి అందజేస్తామని తెలిపారు. తదుపరి శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి సూరజ్ గనోరే ఆధ్వర్యంలో.. పాఠశాలలో తాగునీటి సమస్యను పరిష్కరించామని తెలిపారు.