తీపికబురు.. ఆన్లైన్లోనే 70 శాతం విశాఖ ఇండో-ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ టిక్కెట్లు - విశాఖపట్నంలో డే అండ్ నైట్ వన్డే మ్యాచ్
Interview with ACA Secretary Gopinath Reddy: విశాఖపట్నం క్రీడాభిమానులు ఎప్పటి ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న రోజు త్వరలో రానుంది. విశాఖలో వచ్చే నెల 18వ తేదీన భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరగనున్న డే అండ్ నైట్ వన్డే మ్యాచ్ను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గోపీనాథ్ రెడ్డి తెలిపారు. పోతిన మల్లయ్యపాలెం దగ్గర గల ఏసీఏ - వీడీసీఏ అంతర్జాతీయ మైదానంలో నిర్వహణ కమిటీ సమావేశమైంది. విశాఖలో జరగనున్న మ్యాచ్ నిర్వహణకు పోలీసు శాఖ, జీవీఎంసీ, ఆర్టీసీ తదితర విభాగాల నుంచి సహకారం తీసుకుంటున్నామని గోపీనాథ్ అన్నారు. టికెట్ల విక్రయాలు, పార్కింగ్, ట్రాఫిక్ తదితర సమస్యలపై ప్రత్యేక దృష్టిపెట్టామన్నారు. 24 వేల సీట్ల సామర్ధ్యం కలిగిన ఈ స్టేడియంలో ఆన్లైన్లో 70 శాతం, ఆఫ్లైన్లో 30 శాతం టికెట్ల విక్రయాలు జరుగుతాయన్నారు. ఈ ఆంశంపై త్వరలో జరగనున్న అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరిగే ఈ రెండో వన్డే మ్యాచ్.. ఫ్లడ్ లైట్ల వెలుగులో డే అండ్ నైట్ జరగనుంది. విశాఖలో మరో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరగడం పట్ల క్రీడాభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది. గతంలో జరిగిన టీ-20 మ్యాచ్ విజయవంతం కావడంతో బీసీసీఐ ప్రశంసించిందని.. ఈ మ్యాచ్ కూడా అదే విధంగా విజయవంతం చేస్తామని గోపీనాథ్ చెబుతున్నారు. దీనిపై మరిన్ని వివరాలు ఏసీఏ కార్యదర్శి గోపీనాథ్ రెడ్డితో.. ముఖాముఖి ద్వారా తెలుసుకుందాం.