ఘనంగా ముగిసిన అంతర్జాతీయ తెలుగు మహాసభలు - తెలుగు మహాసభలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 7, 2024, 10:45 PM IST
International Telugu Mahasabhalu Concluded: రాజమహేంద్రవరం గైట్ కళాశాల ఆంధ్ర సారస్వత పరిషత్, చైతన్య విద్యా సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన అంతర్జాతీయ తెలుగు మహాసభలు ఘనంగా ముగిశాయి. ముగింపు సభకు నాగాలాండ్ గవర్నర్ 'లా గణేషన్' ముఖ్య అతిధిగా హాజరయ్యారు. హైకోర్టు ప్రస్తుత, విశ్రాంత న్యాయమూర్తులతో పాటు సినీ నటుడు అలీ, మంత్రి మేరుగ నాగార్జున, గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, దివంగత నటుడు కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి, తదితరులు పాల్గొన్నారు.
ఇక్కడి పూర్వికులు ఆస్తితోపాటు తరతరాలకు తెలుగు భాషను వారసత్వ సంపదగా ఇవ్వటం గొప్ప విషయమని నాగాలాండ్ గవర్నర్ లా గణేషన్ అన్నారు. తెలుగు అనేది భాష మాత్రమే కాదు, ఒక సాంస్కృతిక గుర్తింపు అని, చరిత్రలో చాలామంది స్వరకర్తలు, సాహిత్యకారులు, రచయితలను తెలుగు భాష అందించిందని లా గణేషన్ కొనియాడారు. మాతృభాష తెలుగును కాపాడుకోవాలని, అందుకోసం ప్రతి ఒక్కరూ ప్రప్రథమంగా తెలుగులోనే మాట్లాడాలని, తెలుగులోనే రాయాలని తెలిపారు. తెలుగులోనే సంతకం చేయాలని కోరుతున్నానని, అప్పుడే అంతర్జాతీయ తెలుగు మహాసభల లక్ష్యం నెరవేరుతుందని లా గణేషన్ అన్నారు. కవులు, పాలకులకు అసూయ ఉండకూడదన్న జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, పోలవరం ప్రాజెక్టును జగన్ పూర్తి చేస్తే వాటి ఫలాలు ప్రజలకు దక్కుతాయన్నారు. తెలుగు భాష గొప్పతనాన్ని వివరిస్తూ ఆయన పాడిన పాట అందరిని ఉత్తేజపరిచింది.