వైసీపీలో రచ్చకెక్కిన వర్గపోరు - గడపగడపకు కార్యక్రమం అడ్డుకున్న గ్రామస్థులు, ఉద్రిక్తత - గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఉద్రిక్తత
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 9, 2023, 5:06 PM IST
Internal Clashes Between YCP Leaders: అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండలం వైసీపీలో ఆధిపత్య పోరు రోడ్డెక్కింది. మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ శివరామిరెడ్డి మధ్య వర్గపోరు రచ్చకెక్కింది. కొనకొండ్లలో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి గడపగడపకు కార్యక్రమం నిర్వహించారు. ఇది వైసీపీ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి స్వగ్రామం కావడంతో పోలీసులు భారీగా మోహరించారు. ఇతర ప్రాంతాల నుంచి కార్యకర్తలను తరలించి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేస్తున్నారని శివరామిరెడ్డి వర్గీయులు ఆరోపించారు.
స్థానికేతరులు ఎలా పాల్గొంటారంటూ.. వైసీపీ ఎంపీ తలారి రంగయ్య (Talari Rangaiah), విశ్వేశ్వర్ రెడ్డిని గ్రామస్థులు చుట్టుముట్టారు. సమస్యలు పరిష్కరించకుండా గ్రామంలోకి ఎలా వస్తారంటూ రోడ్డుపై బైఠాయించారు. గ్రామ సమస్యలు పరిష్కారించిన తర్వాత కార్యక్రమం నిర్వహించాలన్నారు. తమపై తప్పుడు కేసులు పెట్టించిన విశ్వేశ్వర్ రెడ్డికి.. ఇళ్లకు వచ్చే అర్హత లేదని మండిపడ్డారు. విశ్వేశ్వర్ రెడ్డి గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ప్రజాప్రతినిధులను అడ్డుకున్న వారిని పోలీసులు స్టేషన్‌కు తరలించేందుకు యత్నించారు. ఏ తప్పు చేశారని స్టేషన్‌కు తరలిస్తారని పోలీసులతో మహిళలు నిలదీశారు. మహిళలు వాహనానికి అడ్డుతగలడంతో ఉద్రిక్తత నెలకొంది.