Inhuman incident: అయ్యో చిట్టి తల్లీ.. ఇంట్లో మూత్రం చేసిందని తల్లి ఏం చేసిందంటే..! - cohabitant
Inhuman incident: ఇంట్లో మూత్రం పోసిన చిన్నారిపై ఆమె తల్లి, ఆమెతో సహజీవనం చేస్తున్న వ్యక్తి కలిసి ఇనుపకడ్డీతో వాతలు పెట్టిన అమానవీయ ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చోటు చేసుకుంది. హిందూపురం మండల బసవేశ్వర కాలనీకి చెందిన అమృత.. మణికంఠ అనే వ్యక్తితో సహజీవనం కొనసాగిస్తోంది. అయితే, అమృత కుమార్తె (6) ఇంట్లో మూత్ర విసర్జన చేసిందన్న కారణంతో అమృత, మణికంఠ కలిసి చిన్నారి ఒంటిపై ఇనుప కడ్డీతో వాతలు పెట్టారు. కాలిన గాయాలతో పాఠశాలకు వెళ్లిన చిన్నారిని గమనించిన ఉపాధ్యాయులు.. ఏం జరిగిందని ఆరా తీశారు. విషయం తెలుసుకున్న ఉపాధ్యాయులు ఐసీడీఎస్ సిబ్బందితో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఐసీడీఎస్ సిబ్బంది, పోలీసులు పాఠశాలకు చేరుకుని విచారణ చేపట్టారు. చివరికి తానే వాతలు పెట్టానని చిన్నారి తల్లి ఒప్పుకోవడంతో... అక్కడికి చేరుకున్న స్థానికులు ఆమెతో వాగ్వాదానికి దిగారు. వెంటనే గాయాలపాలైన చిన్నారిని ఐసీడీఎస్ అధికారులు హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఘటనపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.