Indrakeeladri Giri Pradakshina: అంగరంగ వైభవంగా సాగిన ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ
Indrakeeladri Giri Pradakshina 2023 : విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో సాగింది. శోభకృత్ నామ సంవత్సరం పౌర్ణమిని పురస్కరించుకుని దేవస్థానం వైదిక కమిటీ సూచనల మేరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ప్రతి పౌర్ణమి రోజున ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ నిర్వహిస్తున్నారు.
ఆలయ పాలకమండలి సభ్యులు, అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు ఇంద్రకీలాద్రి కొండ దిగువన కామధేను అమ్మవారి ఆలయం నుంచి ప్రదక్షిణ ప్రారంభించి, సుమారు ఏడు కిలోమీటర్ల కొండచుట్టూ తిరిగి అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు. కుమ్మరిపాలెం, పాలఫ్యాక్టరీ, చిట్టినగర్, కొత్తపేట మీదుగా మహామండపం వరకు సాగిన ఈ ప్రదక్షిణలో దారిపొడవునా భక్తులు అమ్మవారి ఉత్సవ మూర్తులను దర్శించుకుని హారతులు, దూప, దీపాలు సమర్పించారు.
అమ్మవారి ప్రచార రథం ముందు సాగగా.. మేళతాళాలు, వేదమంత్రోచ్ఛరణల మధ్య అమ్మవారి రథాన్ని లాగుతూ ప్రదక్షిణలో భక్తులు పాల్గొన్నారు. ఉదయం ఐదున్నర గంటల నుంచి ఈ ప్రదక్షిణ ప్రారంభమై తొమ్మిదిన్నర గంటలకు ముగిసింది. భక్తులకు అసౌకర్యం లేకుండా చూసేందుకు అంబులెన్స్‌తో వైద్య బృందాన్ని కూడా ప్రదక్షిణలో భాగస్వాములను చేశారు. భక్తులకు ఉచిత ప్రసాదం అందించారు