Konijeti Rosaiah Bronze Statue: దేశ రాజకీయాల్లో మహోన్నత వ్యక్తి రోశయ్య - కొణిజేటి రోశయ్య కుటుంబం
Konijeti Rosaiah Bronze Statue: తెనాలి నుంచి రాజకీయాలు నేర్చుకుని భారతదేశ రాజకీయాల్లో పెట్టని కోటలా తయారైన మహోన్నత వ్యక్తి.. మాజీ గవర్నర్, మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య అని మంత్రి మేరుగు నాగార్జున కొనియాడారు. గుంటూరు జిల్లా తెనాలిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఆవరణలో కొణిజేటి రోశయ్య మండపాన్ని ఏర్పాటు చేసి అందులో ఆయన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. రోశయ్య విగ్రహాన్ని ఆవిష్కరించటం సంతోషకరమని రాష్ట్ర మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. రోశయ్య విగ్రహాన్ని ఆయన కుమారుడు శివ సుబ్బారావు దంపతులు ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్యే శివకుమార్.. రోశయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విగ్రహావిష్కరణ అనంతరం విగ్రహ శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు రవిచంద్రలను సత్కరించారు. అనంతరం మంత్రి నాగార్జున మాట్లాడుతూ భావితరాలకు రాజకీయాల్లో.. మార్గదర్శిగా, స్ఫూర్తిగా, ఆదర్శంగా తీసుకునేందుకు కొణిజేటి రోశయ్యకు మండపం ఏర్పాటు చేయటం సమంజసమేనన్నారు. రోశయ్య ఆదర్శాలను కొన్నింటినైనా ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.