Class war in YSRCP హిందూపురం వైఎస్సార్సీపీలో వర్గపోరు తారాస్థాయికి .. పోలీస్స్టేషన్ వేదికగా పంచాయితీ - నవీన్
Class war in YSRCP : శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో అధికార పార్టీ వైఎస్సార్సీపీలో కుమ్ములాట తారాస్థాయికి చేరింది. పట్టణంలోని ఇందిరమ్మ కూడలి వద్ద పార్టీకి చెందిన ఇరు వర్గాల మధ్య వాదోపవాదాలతో ఘర్షణ చోటుచేసుకుని ఇరువర్గాలు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నాయి. ఇటీవల ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ కు వచ్చే ఎన్నికల్లో హిందూపురం అసెంబ్లీ స్థానం కేటాయించాలని ఇక్బాల్ వర్గానికి చెందిన నాయకులు కార్యకర్తలు ర్యాలీలు, బల ప్రదర్శన నిర్వహిస్తున్న నేపథ్యంలో.. నవీన్ నిశ్చల వర్గానికి చెందిన కొంతమంది సామాజిక మాధ్యమాల్లో ఇక్బాల్ కు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారని ఇందిరమ్మ కూడలి వద్ద ఇరు వర్గాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఈ వివాదం కాస్తా ఘర్షణకు దారి తీయడంతో పోలీసులు హుటా హుటిన ఇందిరమ్మ కూడలికి చేరుకున్నారు. ఇరువర్గాలకు చెందిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ ఇరువర్గాల శ్రేణులు పెద్ద ఎత్తున ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నాయి.