Ration smuggling in Bapatla : బాపట్ల జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత.. - ration shop
Illegally stored ration seized in Bapatla పేదలకు చెందాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమార్కులు యథేచ్ఛగా పక్కదారి పట్టిస్తున్నారు. బాపట్లజిల్లాలో వేరు వేరు చోట్ల అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పట్టుకున్నారు. వేటపాలెం మండలం కొత్తపేటలో పాత ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సమీపంలోని ఓ ఇంట్లో అక్రమంగా నిల్వచేసిన 90 బస్తాల బియ్యాన్ని అధికారులు స్వాధీనపరుచుకున్నారు. మరోచోట తెల్లవారుజామున కారంచేడు మండలం తిమ్మిడిదపాడు వద్ద రెండు వాహనాల్లో తరలిస్తున్న మరో 200 బస్తాల రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు పట్టుకున్నారు. అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తే ఉపేక్షించేది లేదని అధికారులు హెచ్చరించారు.
వైసీపీ అధికారంలోకి వచ్చాక రేషన్ మాఫియా చెలరేగిపోతోంది. కొన్ని గ్రామాలు, పట్టణాల్లో బియ్యం ఎప్పుడు వస్తాయో, ఎప్పుడు పంపిణీ చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. మొత్తంగా ఇంటింటికీ రేషన్ పంపిణీ పేరుతో అవకతవకలు మరింత పెచ్చుమీరాయి. అక్రమ రవాణా భారీగా పెరిగింది. అయినా సీఎం జగన్ ముచ్చటపడి ప్రారంభించిన ఇంటింటికి రేషన్ పథకం కావడంతో.. అధికారులూ చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. రాష్ట్రంలో నెలకు 2 లక్షల 8 వేల టన్నుల బియ్యం పంపిణీ చేస్తుంటే అందులో 40 శాతం వరకు పక్కదారి పడుతున్నాయంటే అక్రమార్కుల దోపిడీ ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.