Illegal Soil Transportation: టిడ్కో లేఔట్ల ముసుగులో అక్రమ మట్టి రవాణా.. చోద్యం చూస్తున్న అధికారులు - కృష్ణా జిల్లా ప్రధాన వార్తలు
Illegal Soil Transportation In Gudivada : కృష్ణా జిల్లా గుడివాడ టిడ్కో లేఔట్ల ముసుగులో వైఎస్సార్సీపీ నేతలు అక్రమంగా మట్టి తరలిస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. టిడ్కో పనులంటూ టిప్పర్లకు స్టిక్కర్లు అతికించి, ఇటుక తయారీదారులకు మట్టి తోలుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సొంత పొలాలకు మట్టి తీసుకోవాలంటేనే రెవెన్యూ అధికారులు సవాలక్ష ప్రశ్నలు అడుగుతారని, రాజకీయ నాయకులు ఒత్తిడి వల్ల అధికారులు అక్రమ మట్టి రవాణా జరుగుతున్నా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గుడివాడలో పెద్ద ఎత్తున అక్రమ మట్టి దందా జరుగుతుందని, గూడూరు మండలం తరకటూరు, గుడివాడ మండలం లింగవరం ఇటుక బట్టీలకు అధికార పార్టీ నేతలు యథేచ్ఛగా మట్టి రవాణా చేస్తున్నారన్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తున్నవారికి, ఇవి అధికార పార్టీ ఎంపీకి చెందిన వాహనాలు ఏం చేస్తారో చేసుకోండని సిబ్బంది బెదిరింపులకు దిగుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వారం రోజులుగా ఏటువంటి అనుమతులు లేకుండా మట్టి అక్రమ రవాణా అవుతుందని, రెవెన్యూ అధికారులకు సమాచారం ఇస్తే, పరిశీలిస్తామంటూ మాట దాటవేసే సమాధానం చెబుతున్నారని స్థానికులు అంటున్నారు.