Amaravati Farmers Fire: 'ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా.. ఒకరిద్దరి అరెస్ట్ తర్వాత మళ్లీ మామూలే' - బోరుపాలెం అక్రమ తవ్వకాలు
Illegal Soil Mining In Amaravati : నామమాత్రపు కేసులతో రాజధాని ప్రాంతంలో అక్రమ తవ్వకాలు ఆగటం లేదని రైతులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఒకరిద్దర్ని పట్టుకుని అరెస్టు చేసి నామమాత్రపు కేసులు పెట్టి వదిలేయటం మామూలయ్యిందని రైతులు ఆరోపిస్తున్నారు. తూళ్లురు మండలంలోని మందడం, ఐనవోలులోని ప్లాట్లలోని మట్టిని అక్రమంగా తరిలిస్తే.. పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదని రైతులు వాపోతున్నారు. అందువల్లే అక్రమార్కలు రెచ్చిపోయి, ప్రస్తుతం మరో గ్రామంలో అదే తీరుగా మట్టి అక్రమంగా తవ్వి తీసుకెళ్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అబ్బురాజుపాలెం, బోరుపాలెంలో రైతులకు అందించిన ప్లాట్లలో గత కొద్ది రోజులుగా.. కొంతమంది అక్రమార్కులు రాత్రివేళల్లో మట్టిని తవ్వి తీసుకెెళ్తున్నారని రైతులు అన్నారు. రాత్రి సమయంలో మట్టిని తరలిస్తున్న ప్రాంతాన్ని రైతులు పరిశీలించారు. తాము ఫిర్యాదు చేసిన ప్రతిసారి పోలీసులు ఒకరిద్దర్ని పట్టుకుని వదిలేస్తున్నారని.. దాంతో అక్రమార్కులు మళ్లి తవ్వకాలు మొదలుపెడుతున్నారని రైతులు అన్నారు. ఇప్పటికైనా పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలని.. లేకపోతే సీఆర్డీఏ కార్యాలయం ముట్టడిస్తామని రైతులు హెచ్చరించారు.