Illegal Gravel Mining: వైసీపీ నేతల గ్రావెల్ దందా.. తమ ప్రాణాలకు ముప్పు ఉందని స్థానికుల ఆందోళన! - అక్రమ గ్రావెల్ దందా న్యూస్
Illegal Gravel Mining: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో విచ్చలవిడిగా అక్రమ గ్రావెల్ దందా కొనసాగుతోంది. నెల్లూరు పాలెంలో జగనన్న కాలనీల వద్ద వైసీపీ నాయకులు చేస్తున్న అక్రమ గ్రావెల్ తవ్వకాలను స్థానికులు అడ్డుకున్నారు. గత రెండు సంవత్సరాల నుంచి జగనన్న కాలనీల పేరుతో భారీగా గ్రావెల్‌ను వైసీపీ నాయకులు అక్రమంగా తరలిస్తున్నారు. ఇలా విచ్చలవిడిగా గ్రావెల్ తవ్వకాలు చేయడంతో భారీగా గుంతలు ఏర్పడుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. పశువులు మేత వేయటానికి కాస్త స్థలం కూడా లేకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలో కూడా అక్రమ గ్రావెల్ తవ్వకాలను అడ్డుకున్న స్థానికుడిపై వైసీపీ నాయకులు గొడ్డలితో దాడికి దిగినట్లు ఆరోపణలున్నాయి. గతంలో అక్రమ గ్రావెల్ తవ్వకాలను అడ్డుకున్న తనపై వైసీపీ నేతలు గొడ్డలితో దాడికి దిగినట్లు వెంకటేశ్వర్లు నాయుడు అన్నాడు. ఇప్పుడు కూడా అక్రమ తవ్వకాలను అడ్డుకున్న తనకు వైసీపీ నేతలతో ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు.