Man Kills Mother in law: భార్యపై అనుమానంతో దాడి.. అడ్డొచ్చిన అత్తను చంపి పరార్.. - husband Attack on wife
Man Kills Mother in law: తండ్రి లేకపోయినా.. కుమార్తెను అల్లారుముద్దుగా పెంచింది. పెళ్లి చేసింది. భర్తతో సంతోషంగా ఉంటుందనుకుంది.. కానీ తన కుమార్తెను నిత్యం వేధిస్తున్నాడని తెలిసి తట్టుకోలేకపోయింది. అల్లుడికి నచ్చజెప్పి.. ఇద్దరినీ తన వద్దకు తీసుకొనివచ్చింది. ఇక మీదట అంతా మంచిగానే ఉంటుందనుకుంది. అయినా సరే అల్లుడికి, కుమార్తెకు మధ్య గొడవలు జరుగుతునే ఉండేవి. తాజాగా మరోసారి గొడవ జరగగా.. విచాక్షణారహితంగా దాడికి పాల్పడుతున్న తను అల్లుడి నుంచి కుమార్తెను కాపాడుకునే క్రమంలో తన ప్రాణం పోగొట్టుకుంది.
కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం నాగులాపల్లి పంచాయతీ శివారు ఉప్పరగూడెనికి చెందిన సింహాచలంతో ప్రత్తిపాడు మండలం ఒమ్మంగి గ్రామానికి చెందిన దండ్రు శ్రీనుతో 12ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి ముగ్గురు కుమార్తెలు. కొంతకాలంగా భార్యపై శ్రీనుకు అనుమానం ఏర్పడింది. తరచూ గొడవలు జరుగుతుండేవి. దీంతో ఏడాది కిందట అత్త రాణి.. కూతురు, అల్లుడిని ఉప్పరగూడెం తీసుకొచ్చి కాపురం పెట్టించింది. భార్యాభర్తలు ఇద్దరూ కూలి పనిచేసుకుని జీవనం సాగిస్తున్నా.. గొడవలు తగ్గలేదు. దీంతో భార్యను హతమార్చాలని నిర్ణయించుకున్న శ్రీసు ఆదివారం ఉదయం కూలి పనికెళ్లి మధ్యాహ్నం ఇంటికొచ్చాడు. కుమార్తెలు ఇద్దరినీ దుకాణానికి పంపించాడు. భార్య సింహాచలంతో గొడవ పెట్టుకుని కత్తితో దాడికి దిగాడు.
అరుపులు విన్న అత్త గుర్రాల రాణి అడ్డురాగా.. ఆమె ఘటనా స్థలిలోనే హత్యకు గురయ్యారు. భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం శ్రీను అక్కడినుంచి పరారయ్యాడు. అపస్మారకస్థితిలో ఉన్న శ్రీను భార్య సింహాచలాన్ని చికిత్స నిమిత్తం పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి అక్కడినుంచి మెరుగైన చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని వివరాలు సేకరించారు. పరారైన నిందితుడి కోసం గాలిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమితం ఆసుపత్రికి తరలించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. అమ్మమ్మ మృతిచెందగా, తల్లి గాయాలతో ఆసుపత్రి పాలైంది. తండ్రి హత్యచేసి పరారయ్యాడు. ఈ ఘటనతో ముగ్గురు చిన్నారులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.