Fire accident: తోటలో చెత్త తగలబెడుతూ... మంటల్లో చిక్కుకొని దంపతుల మృతి - ఏపీ వార్తలు
Fire accident in AP: శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం చిన్నరావుపల్లి గ్రామానికి విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన గురుగుబిల్లి నరసింహ (75), గురుగుబిల్లి సరోజినమ్మ (72) దంపతులు మంటల్లో చిక్కుకొని మృతి చెందారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఆదివారం దంపతులు ఇద్దరు తమ నీలగిరి తోటలో చెత్తను తగలబెట్టేందుకు వెళ్లారు. మంట పెట్టే క్రమంలో తోటలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంతలో పక్క పొలంలోకి మంటలు వ్యాపించాయి. ఈ నేపథ్యంలో మంటలను అదుపుచేసే క్రమంలో తోటలో మంటలతో పాటు దట్టమైన పొగ వ్యాపించాయి. పొగలకు ఊపిరి ఆడకపోవడంతో దంపతులిద్దరూ అక్కడే కుప్పకూలిపోయారు. ఈ ఘటనలో భార్యాభర్తలిద్దరూ మంటల్లో చిక్కుకొని కాలిపోయి మృతి చెందారు. ప్రమాద ఘటనపై గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఎచ్చెర్ల ఎస్ఐ సత్యనారాయణ ఘటన ప్రదేశాన్ని సందర్శించారు. దంపతుల మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మృతులకు ఐదుగురు పిల్లలు ఉన్నారు. దంపతులిద్దరూ ఒకేసారి మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
TAGGED:
fire accident in AP