కైలాసగిరుల్లో భారీ మంటలు.. ఆకతాయిల పనేనా..! - srikalahastii at Tirupati district
Fire In Kailasagirulu : తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయానికి సమీపంలోని కైలాసగిరుల్లో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. బుధవారం సాయంత్రం 5 గంటల నుంచే దట్టమైన పొగలు వ్యాపించి, రాత్రి వరకు అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. సుమారు రెండు కిలో మీటర్లకు పైగా అటవీ ప్రాంతమంతా దగ్ధమైందని అధికారులు అంచనా వేస్తున్నారు. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడడం వల్ల భరద్వాజ తీర్థం సమీపంలోని గోశాల వద్దకు మంటలు వ్యాపించకుండా అధికారులు చర్యలు చేపట్టారు. స్థానికంగా ఉండే అగ్నిమాపక సిబ్బంది, యంత్రాలతో పాటు కైలాసగిరిలో చుట్టుపక్కల ఉన్న స్థానికులు, ఆలయ అధికారులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు వ్యాపించకుండా అదుపులోకి తీసుకొచ్చారు. విలువైన వృక్ష సంపద అగ్నికి ఆహుతి అయ్యింది. ఆకతాయిల కారణంగా అగ్నిప్రమాదం చోటు చేసుకుని ఉండొచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
ఘటనాస్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే: కైలాసగిరి పర్వత శ్రేణుల్లో భారీగా వ్యాపించిన మంటలను అదుపు చేయాలని ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంటలు గోశాల వద్దకు చేరాయన్న సమాచారంతో గోశాల వద్దకు వచ్చి మంటలను పరిశీలించారు. గోవులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, అలాగే మంటలను పూర్తిగా నియంత్రించే విధంగా చర్యలు తీసుకోవాలని అగ్ని మాపక సిబ్బందికి ఆదేశించారు.