Chariot: పెన్నా అహోబిలంలో కూలిన రథం.. తప్పిన పెను ప్రమాదం - అనంతపురం జిల్లా లేటెస్ట్ న్యూస్
Huge Chariot Collapsed: అనంతపురం జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. ప్రసిద్ధి గాంచిన పెన్నా అహోబిలం శ్రీలక్ష్మి నరసింహస్వామి ఆలయ మహా రథానికి మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా కూలిపోయింది. శిథిల దశకు చేరుకున్న ఆ రథాన్ని మే 2 నుంచి జరగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలను దృష్టిలో పెట్టుకుని భారీ క్రేన్ల సహాయంతో దాని చక్రాలను మరమ్మతులు చేస్తుండగా ఈ ఘటన జరిగింది. కాగా ఆ సమయంలో అక్కడ ఉన్న భక్తులు, మరమ్మతులు చేస్తున్న వ్యక్తులు అప్రమత్తమై వెంటనే పరుగులు తీయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దాదాపు పదేళ్ల క్రితమే ఆ రథం శిథిలావస్థకు చేరుకున్నా దేవదాయ శాఖ అధికార యంత్రాంగం మాత్రం పట్టించుకోలేదు. కొత్త రథం తయారీకి భక్తులు స్వచ్ఛందంగా రూ.80 లక్షల వరకు విరాళాలు ఇచ్చినా కొత్త రథం తయారీ దిశగా దేవదాయ శాఖ అధికారులు చొరవ చూపలేదు. బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్న వేళ ఈ రథం కూలిపోవడంతో భక్తులు తీవ్ర ఆందోళనకు గురువుతున్నారు.