హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు - వీడిన గృహిణి అనుమానాస్పద మృతి కేసు - icchapuram murder news
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 10, 2023, 7:17 PM IST
House Wife Death Mystery Solved in Itchapuram: శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో గృహిణి అనుమానాస్పద మృతి కేసు మిస్టరీ విడింది. తామే హత్య చేశామని అత్తామామలు పోలీసులకు లొంగిపోయారు. తామే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించామని తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఇచ్చాపురం సర్కిల్ పోలీస్ కార్యాలయంలో ఇన్స్పెక్టర్ ఈశ్వర్ ప్రసాద్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. అక్టోబర్ 8వ తేదీన నీలాపు మీనా కుమారి అనుమానాస్పద స్థితిలో తన నివాసంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆమెకు ఐదేళ్ల బాలుడు, రెండు నెలల బాలిక ఉన్నారు. కడుపునొప్పి తాళలేక ఆత్మహత్య చేసుకుందని అత్తమామలు పోలీసులను నమ్మించారు. అయితే పోలీసులు ఈ మృతిని అనుమానాస్పద మృతిగా నమోదు చేశారు. ఇదిలా ఉండగా మీనా కుమారి అత్త అన్నపూర్ణ, మామ జగ్గారావు తామే తమ కోడలను హత్య చేసినట్లు అంగీకరించారని సీఐ తెలిపారు.
పోస్టుమార్టం నివేదిక బయటికి వస్తే ఆమె మృతి ఆత్మహత్య కాదనే విషయం బయట పడుతుందనే భయంతో వారు నేరాన్ని అంగీకరించారని చెప్పారు. మీనా కుమారి భర్త మోహన్రావు పోలాండ్లో పని చేస్తున్నారు. మీనా కుమారితో అత్తామామలకు తరచూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఆ క్రమంలో అత్తామామలు మీనా కుమారిని హతమార్చారని చెప్పారు. ఆత్మహత్యగా చిత్రీకరించడంలో వారికి సహకరించిన బంధువు హేమరాజును పోలీసులు అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఈ సమావేశంలో పట్టణ ఎస్సై కె. గోవిందరావు కూడా పాల్గొన్నారు.