Hotel Owners Agitation for Bills వరద బాధితులకు భోజనాల బిల్లులు.. మూడేళ్లు అయినా చెల్లించకపోవడంతో లబోదిబోమంటున్న హోటళ్ల నిర్వాహకులు - ap news
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 22, 2023, 6:20 PM IST
Hotel Owners Agitation for Bills in Jaganannaku Chebudam Programme :రోడ్డున పడ్డ వరద బాధితుల ఆకలి తీరిస్తే.. ప్రభుత్వం మాత్రం తమను రోడ్డున పడేస్తోందని కోనసీమలోని హూటళ్ల యజమానులు లబోదిబోమంటున్నారు. తాము అప్పుల్లో కూరుకుపోయామని.. ఆత్మహత్యలే గతి అంటూ జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎదుట వారి ఆవేదన విన్నవించుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే...
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలంలో 2020 జులై, ఆగస్టు 2022 జూలైలో వరదలు వచ్చాయి. ఆ సమయంలో బాధితులకు భోజనాలు అందించేందుకు అధికారులు వివిధ హోటళ్ల యజమాలను ఆశ్రయించారు. వారు చెప్పిన ప్రకారం వరద బాధితులకు భోజనాలు సరఫరా (Hotel Owners Supplies to Food For Flood Victims) చేశారు. కానీ నేటికీ డబ్బులు చెల్లించకపోవడంతో వారు బాధితులుగా మిగిలిపోయి అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మండలంలో సుమారు 50 లక్షల రూపాయల భోజనాలు అందించారని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.
పి.గన్నవరంలో నిర్వహించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో హోటళ్ల యజమాలు తమ గోడును జాయింట్ కలెక్టర్కు మొరపెట్టుకున్నారు. నారాయణమూర్తి అనే యజమాని అయితే జాయింట్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్ ముందు తనకు ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారని, ఇళ్లు గడవడం చాలా కష్టంగా మారిందని, అప్పుల్లో కూరుకుపోయామని, ఆత్మహత్యలే గతి అంటూ వేడుకున్నారు. మూడేళ్లు అయినా బిల్లులు చెల్లించకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ స్పష్టం చేయడంతో హోటళ్ల యజమానులు వెనుదిరిగారు.