Students are starving: కరెంటు లేదన్న సాకుతో వంట బంద్.. వసతి గృహం విద్యార్థుల ఆకలి కేకలు..
Hostel students are starving at Paderu: అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు తలారసింగి బాలుర గిరిజన సంక్షేమ పాఠశాల వసతి గృహం విద్యార్థులు బుధవారం ఆకలితో అలమటించారు. వసతి గృహం సిబ్బంది ఉదయం నుంచి కరెంటు లేదని నీళ్లు లేక వంట చేయలేదు. సుమారు 500 మంది విద్యార్థులు.. మధ్యాహ్నం వసతి గృహానికి వెళ్లి భోజనం లేకపోవడంతో ఆకలితో వెనుతిరిగారు. విషయం తెలిసి దగ్గర్లో, అందుబాటులో ఉన్న తల్లిదండ్రులు కొందరు ఇళ్ల నుంచి, మరికొందరు హోటళ్లలో పార్సిల్స్ తీసుకొచ్చి ఇచ్చారు. వసతి గృహంలో విద్యార్థులను పస్తులు ఉంచుతారా.. అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నించారు. నీళ్లు లేకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలి, లేదంటే బయట వంట చేయించి తీసుకురావాలి కదా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న గిరిజన సహాయ సంక్షేమ అధికారి రజిని పరిస్థితి సమీక్షించి.. విద్యార్థులకు బిస్కెట్ ప్యాకెట్లు అందజేశారు. కరెంటు వచ్చిన తర్వాత మూడు గంటలకు నీళ్లు పట్టి సిబ్బంది వంటను ప్రారంభించారు. పాడేరు కలెక్టరేట్‌కు సమీపంలో ఉన్న పాఠశాలలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక మారుమూల ప్రాంతాల్లో సంక్షేమ పాఠశాలల పరిస్థితి ఏమిటని విద్యార్థులు తల్లిదండ్రులు ప్రశ్నించారు.