అమరావతి రైతులకు అరసవెల్లిలో ఘన స్వాగతం.. చీరసారెతో టీడీపీ నేతల సత్కారం..
Amaravati to Arasavelli farmers Honoring program: అమరావతి నుంచి అరసవెల్లికి మహా పాదయాత్రగా చేరుకున్న అమరావతి రైతులు, మహిళలకు టీడీపీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. మహిళలకు పసుపు, కుంకుమ, చీరలతో సత్కరించగా.. పురుషులకు పంచలు ఇచ్చి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రైతులు, మహిళలు, ఎచ్చెర్ల నియోజకవర్గం టీడీపీ నాయకులు, ఉత్తరాంధ్ర టీడీపీ శిక్షణా తరగతుల మాజీ డైరెక్టర్ కలిశెట్టి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.
కాగా.. అమరావతి రైతుల ఉద్యమం 1000 రోజులు పూర్తైన సందర్భంగా.. 'అమరావతి టు అరసవెల్లి' అనే పేరుతో రైతులు మహా పాదయాత్రను చేపట్టారు. సెప్టెంబరు 12న వెంకటపాలెంలోని తితిదే ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ యాత్రను ప్రారంభించారు. 60 రోజుల పాటు.. 900 కిలోమీటర్లకు పైగా ఈ యాత్రను సాగించాలని రైతులు అనుకున్నారు. అయితే హైకోర్టు తీర్పు తర్వాత జరిగిన పరిణామాలతో అక్టోబరు 20 వరకు మాత్రమే ఈ యాత్రను నిర్వహించారు.
అనంతరం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ని రామచంద్రపురంలో ఈ యాత్ర ఆగిపోయింది. కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం యాత్రలో 600 మంది మాత్రమే పాల్గొనాలని, దీంతోపాటు అందరూ గుర్తింపు కార్డులు చూపించాలని పోలీసులు సూచించారు. అయితే రైతులకు సంఘీభావం తెలిపేవారు ఈ యాత్రలో పాల్గొనటం వల్ల కోలాహలం నెలకొన్న నేపథ్యంలో ఐడీకార్డులు తప్పనిసరని పోలీసులు పట్టుబట్టారు. దీంతో ఈ వ్యవహారం కోర్టులోనే తేల్చుకుంటామంటూ రైతులు తమ పాదయాత్రను అక్టోబరు 22వ తేదీన రైతులు నిలిపివేశారు. కాగా మళ్లీ మార్చి 31న ఉత్సాహంతో రైతులు తమ పాదయాత్రను పునఃప్రారంభించి.. ఆదివారం అరసవెల్లి చేరుకున్నారు.