Hijras Fight in Panyam: పాణ్యంలో రెచ్చిపోయిన హిజ్రాలు.. పోలీస్‌స్టేషన్ ఎదుట రెండు గ్రూప్‌ల వార్ - హిజ్రాల మధ్య ఘర్షణ
Two Hijra group Fight In Panyam : నంద్యాల జిల్లా పాణ్యం పోలీస్ స్టేషన్ ఎదురుగా హిజ్రాలలోని ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఇందూ గ్రూపులో ఉన్న వినీత అనే హిజ్రా మూడు రోజుల క్రితం హసీనా గ్రూపులోకి మారడంతో వివాదం చోటు చేసుకుంది. రెండు నెలల క్రితం వినీతకు చెందిన ఇంటిని అమ్ముకోవడానికి చూడడంతో ఇందూ గ్రూపు వాళ్లు ఇంటిని అమ్మకుండా అడ్డుపడుతున్నారు. ఈ విషయంపై పోలీస్ స్టేషన్లో పంచాయితీ జరిగింది. అప్పటి నుంచి నుంచి ఇందూ గ్రూపు వాళ్లు ఇబ్బందులు పెడుతూ.. కొడుతున్నారంటూ వినీత ఆరోపిస్తోంది. ఇబ్బందులు తట్టుకోలేక ఇందూ గ్రూప్ నుంచి హసీనా గ్రూపులోకి మూడు రోజుల క్రితం మారానని, ఇందూ గ్రూపు వాళ్లు బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ సోమవారం నంద్యాలలో ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన స్పందనలో ఫిర్యాదు చేశామన్నారు.
దీనిపై ఎస్పీ పాణ్యం పోలీస్ స్టేషన్‌కు రెఫర్ చేయడంతో మంగళవారం ఉదయం పాణ్యం పోలీస్ స్టేషన్ వద్దకు రెండు వర్గాలు చేరుకున్నాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ.. ఘర్షణలకు దిగారు. దీంతో ఇందూ గ్రూప్‌నకు సంబంధించిన కొందరు వినీతపై కట్టెలతో దాడికి దిగడంతో ఒకరిపై ఒకరు ఎదురు దాడి చేసుకున్నారు. స్పందించిన పోలీసులు వారికి సర్ది చెప్పి ఎస్సై సుధాకర్ రెడ్డి నంద్యాలలో జరుగుతున్న కార్యక్రమానికి వెళ్లాడని, వచ్చే వరకు వేచి ఉండాలని చెప్పడంతో పోలీస్ స్టేషన్ వద్దనే రెండు వర్గాలు ఉన్నాయి. గాయపడిన వినీత నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు.