ఎస్‌ఐ నియామక ప్రక్రియపై హైకోర్టులో విచారణ - అభ్యర్థులంతా హాజరు కావాలని ఆదేశం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 30, 2023, 4:54 PM IST
High Court Order To Petitioners Attend Monday:ఎస్సై పోస్టుల నియామక ప్రక్రియపై సింగిల్ జడ్జి ఇచ్చిన స్టేను సవాలు చేస్తూ ప్రభుత్వం డివిజన్ బెంచ్ ముందు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. అభ్యర్థులు ఎత్తు కొలిచే ప్రక్రియకు సిద్ధంగా ఉన్నారని అభ్యర్థుల తరపు న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గతంలో రిజర్వ్ ఎస్సైగా పనిచేసిన అభ్యర్థిని ఎత్తు సరిపోలేదని అనర్హునిగా ప్రకటించారని న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ఇటీవల విచారణ చేపట్టిన న్యాయస్థానం.. అభ్యర్ధుల ఎత్తును తమ ఆధ్వర్యంలో కొలిచే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపింది.
విచారణ చేపట్టిన ధర్మాసనం.. పిటిషనర్ల ఎత్తును మ్యానువల్‌గా కొలిచి అర్హులైన వారిని పరీక్షకు అనుమతించాలని హైకోర్టు గతంలో ఆదేశాలిచ్చింది. దీనిపై మరోసారి పలువురు అభ్యర్థులు పిటిషన్ దాఖలు చేశారు. 2019లో ఎత్తు కొలతలో అర్హత సాధించిన అభ్యర్థులు 2023లో ఎలా అనర్హత సాధిస్తారు అని న్యాయస్థానం.. ప్రభుత్వ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. దీనికి ఎంత మంది అభ్యర్థులు సమ్మతిస్తారో వివరాలను తమకు సమర్పించాలని కోర్టు గత విచారణలో ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు పిటిషనర్లంతా సిద్ధంగా ఉన్నారని శ్రావణ్ కుమార్ ధర్మాసనానికి తెలిపారు. వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం పిటిషనర్లు సోమవారం తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది.