విశాఖ ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంపై ముగిసిన విచారణ - తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 28, 2023, 8:07 PM IST
High Court On LG Polymers Gas Leak Incident: విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో జరిగిన పేలుళ్ల బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. ఇరువైపులా వాదనలు ముగియటంతో.. న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. 2020లో ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు 15 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలామంది అస్వస్థతకు గురయ్యారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని, ఘటనపై సమగ్ర విచారణ జరపాలని, మెరుగైన పరిహారం ఇవ్వాలని కోరుతూ పలువురు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. హైకోర్టు ఈ ఘటనను సుమోటోగా స్వీకరించింది.
LG Polymers Gas Leak Incident: 2020 మే 7న విశాఖలోని ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి స్టైరీన్ అనే విషవాయువు లీకైంది. దీంతో నిద్రలోనే పలువురు మృతి చెందారు. ప్రాణాలు దక్కించుకునేందుకు వందలాది మంది చీకట్లోనే పరిగెత్తుతూ.. తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డారు. పరిశ్రమకు ఆనుకుని ఉన్న గ్రామస్థులు నేటికీ పలు సమస్యలతో బాధపడుతున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని, మెరుగైన పరిహారం ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ ముగియగా.. తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది.