Amaravati Assigned Lands Case: రాజధాని ఎసైన్డ్ భూముల వ్యవహారం జీవో 41పై హైకోర్టు విచారణ - మాజీ మంత్రి నారాయణ
High Court on Amaravati Assigned Land case GO 41: రాజధాని ఎసైన్డ్ భూముల వ్యవహారంలో జారీ చేసిన జీవో 41తో నష్టపోయామని ఎస్సీ, ఎస్టీలు ఎవరు ఫిర్యాదు చేయలేదని.. మాజీ మంత్రి నారాయణ తరఫు సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు హైకోర్టులో వాదనలు వినిపించారు. రాజకీయ దురుద్దేశంతో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ కేసు నమోదు చేసిందన్నారు. అందులోని సెక్షన్లు చెల్లుబాటుకావన్నారు. ఎసైన్డ్ రైతుల మేలుకోరి అప్పటి ప్రభుత్వం జీవో 41ని జారీచేశారన్నారు. జీవో జారీ అయిన అయిదేళ్ల తర్వాత దురుద్దేశంతో ఫిర్యాదు చేస్తే సీఐడీ కేసు నమోదు చేయడం చట్టవిరుద్ధం అన్నారు. ఆ జీవోపై అభ్యంతరం ఉంటే అప్పుడే సవాలు చేసి ఉండాల్సిందన్నారు. సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని సీనియర్ న్యాయవాది వెంకటేశ్వర్లు న్యాయస్థానాన్ని కోరారు.
అనంతరం అదనపు ఏజీ వాదనలకు.. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ ప్రతివాదనలు వినిపించేందుకు విచారణను ఈనెల 9కి వాయిదా వేస్తూ.. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీఆర్‌కే కృపాసాగర్ ఉత్తర్వులిచ్చారు. రాజధాని ఎసైన్డ్ భూముల విషయంలో ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయని, అందుకు వీలుగా జీవో 41 జారీ చేశారని వైకాపా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి 2021 ఫిబ్రవరిలో సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా 2021 మార్చిలో తెదేపా అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి పి.నారాయణపై సీఐడీ ఎస్సీ, ఎస్టీ చట్టం, ఎసైన్డ్ భూముల బదిలీ నిషేధ చట్టం, ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. తమపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని వారిరువురు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు వేశారు. 2021 మార్చి 19న విచారణ జరిపిన న్యాయస్థానం.. సీఐడీ నమోదు చేసిన కేసులో దర్యాప్తుతోపాటు తదుపరి చర్యలన్నింటిని నిలుపుదల చేసింది.