బీఈడీ కళాశాలల్లో తనిఖీలకు ఉన్నత విద్యామండలికి అవకాశం లేదు: హైకోర్టు - BED Colleges
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 12, 2024, 6:03 PM IST
High Court dismissed the government's order : బీఈడీ కళాశాలల్లో తనిఖీకి ఉన్నత విద్యామండలిని నియమిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను హైకోర్టు కొట్టివేసింది. కళాశాలల్లో తనిఖీలకు ఉన్నత విద్యామండలిని నియమిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో బీఈడీ కళాశాలల సంఘం పిటిషన్ వేసింది. ఇరువురి న్యాయవాదుల వాదనలు విన్న హైకోర్టు కళాశాలల్లో ఉన్నత విద్యామండలి ద్వారా తనిఖీలు జరిపే అధికారం లేదని తేల్చింది. ప్రత్యేక అధికారిని నియమించుకుని తనిఖీలు జరుపుకోవచ్చని న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకొనే విద్యార్థులు బీఈడీ కోర్సులో చేరుతుంటారు. కానీ, అనేక కళాశాలల్లో నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ఫిర్యాదులు ఉన్నాయి. అధ్యాపకుల కొరత మొదలుకుని, మౌలిక సౌకర్యాల సమస్యలు విద్యార్థులను వేధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీఈడీ కళాశాలల్లో తనిఖీకి ఉన్నత విద్యామండలికి అవకాశాలు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామక జీవో కొట్టివేయాలని కోరుతూ జీవోను సవాల్ చేస్తూ బీఈడీ కళాశాలల సంఘం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై వాదోపవాదనల అనంతరం తనిఖీకి ఉన్నత విద్యామండలిని నియమిస్తూ ఇచ్చిన జీవోను హైకోర్టు కొట్టివేసింది. ఉన్నత విద్యామండలి ద్వారా తనిఖీలు జరిపే అధికారం లేదన్న హైకోర్టు ప్రత్యేక అధికారిని నియమించుకుని తనిఖీలు జరుపుకోవచ్చని స్పష్టం చేసింది.