ఎన్టీఆర్ జిల్లాలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం..నెలకొరిగిన భారీ వృక్షాలు - ఎన్టీఆర్ జిల్లాలో భారీ వర్షం
ఎన్టీఆర్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం పలు చోట్ల రెండు గంటల పాటు ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. భారీగా గాలి వీయడంతో చిల్లకల్లు - వైరా, మక్కపేట - పెనుగంచిప్రోలు రహదారిలో భారీ వృక్షాలు నేల కూలాయి. వత్సవాయి మండలం మక్కపేటలోని మసీదుపై భారీ వృక్షం కూలి కట్టడం పాక్షికంగా దెబ్బతిన్నది. గ్రామంలోని పలు గృహాలకు ఉన్న రేకులు లేచి పడ్డాయి. నందిగామ మండలం సోమవరం గ్రామంలో వరిగడ్డి వాముపై పిడుగు పడింది. వరిగడ్డి పూర్తిగా దగ్ధం కావడంతో రైతుల తీవ్రంగా నష్టపోయారు. మూడు తాటి చెట్లు కూడా పిడుగుపాటుకు దగ్ధమయ్యాయి. వాతావరణంలోని మార్పుతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కల్లాల్లో ఆరబోసిన మిర్చి, మొక్కజొన్న దెబ్బతింటాయని రైతులు వాపోతున్నారు. మొన్న కురిసిన వానలకు తీవ్రంగా దెబ్బతిన్న రైతులకు శుక్రవారం నాటి వర్షం మరింత నష్టం మిగిల్చింది.
తిరువూరు పట్టణ, మండల పరిధిలో విద్యుత్తు స్తంభాలు, చెట్లు విరిగి పడిపోవడంతో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విరిగిన స్తంభాల స్థానంలో కొత్తవి వేసే పనిలో విద్యుత్తు అధికారులు నిమగ్నమయ్యారు. మరోవైపు లోతట్టు ప్రాంతాలు జలమయ మవడంతో మురుగు నీరు రహదారులపై ప్రవహిస్తూ కాలువలను తలపించాయి.
TAGGED:
VARSHAM