Heavy rain: తడిసి ముద్దైన కర్నూలు జిల్లా.. పొంగిపొర్లుతున్న వాగులు - కర్నూలు వార్తలు
అకాల వర్షాలతో ఉమ్మడి కర్నూలు జిల్లా తడిసి ముద్దైంది. కర్నూలు సహా గోనెగండ్ల, ఎమ్మిగనూరు, నంద్యాల, కొలిమిగుండ్ల, ఓర్వకల్లు, కృష్ణగిరి, మహానంది, సున్నిపెంట, దేవనకొండ, సి.బెళగల్ మండలాల్లో భారీగా వర్షాలు కురిసాయి. అకస్మాత్తుగా ప్రారంభమైన వర్షం చాలా సమయం వరకు కురిసింది. ఈదురు గాలులతో కూడిన జోరు వానతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వివిధ పనుల కోసం బయటకు వెళ్లిన ప్రజలు, వాహనదారులు ఒక్కసారిగా కురిసిన వర్షంతో తడిసి ముద్దయ్యారు. పనులు ముగించుకుని ఇంటికి వెళ్లే సమయంలో ఈదురు గాలులు, ఉరుములతో కురిసిన వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జిల్లాలోని ఎమ్మిగనూరులో భారీ వర్షం కురిసింది.. మంగళవారం ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి.. పట్టణంలోని మునెప్పనగర్, అయ్యప్ప స్వామి దేవాలయంతో పాటు.. లోతట్టు కాలనీలు నీట మునిగాయి. ఎమ్మిగనూరు - మంత్రాలయం ప్రధాన రహదారి పై వర్షం నీరు ప్రవహించింది. రహదారి పక్కనే ఉన్న ఓ పెట్రోల్ బంకు నీట మునిగింది. గోనెగండ్ల మండలంలోని పెద్దమర్వీడు, గంజిహళ్లిలో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.