వేసవి కాలం వస్తున్న వీడని చలి.. ఆ జిల్లా వాసులకు పొగ మంచు ఎఫెక్ట్ - Fog during summer in Palamaneru
చిత్తూరు జిల్లా పలమనేరులో పొగ మంచు ఎఫెక్ట్ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. వేసవి కాలం వస్తున్నా చలి, మంచు ప్రభావం తగ్గడం లేదు. పలమనేరులో పొగమంచు కారణంగా పెరిగిన చలి తీవ్రతతో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. చలి తట్టుకోలేక ప్రజలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. వేసవి కాలం ప్రారంభమైనా చలి తీవ్రత ఏ మాత్రం తగ్గకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పొగ మంచు కారణంగా వాహనదారులకు రోడ్డుపై ఎదురుగా వచ్చే వాహనాలు సైతం కనబడడం లేదు. ఉదయం 7 గంటలు అవుతున్నా మంచు ప్రభావం తగ్గకపోవడంతో వాహనదారులు నిదానంగా వెళ్తున్నారు. పది అడుగుల దూరంలో ఉన్న మనుషులు కూడా కనిపించనంత దట్టంగా మంచు కురుస్తోంది.
మార్చి నెలలో కూడా మంచు ప్రభావం వాహన రాకపోకలకు ఆటంకంగా మారింది. పర్యావరణంలో రోజు రోజుకీ చోటు చేసుకున్న మార్పులను ప్రజలు ఏ విధంగా తీసుకోవాలో తెలియక డైలమాలో పడుతున్నారు. పలమనేరు పరిసర ప్రాంతాల్లో ఉన్న రైతులు సైతం పొగ మంచు వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ వ్యవసాయ పొలాల్లో పనులను చేసుకోలేని పరిస్థితి నెలకొంది. గజగజ వణుకుతూ వీధుల్లో చలి మంటలు వేసుకుంటున్నారు.