Heat Conditions in AP: డేంజర్ బెల్స్..! రుతుపవనాల మందగమనంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు..?
Heat Conditions in AP: గత వారం రోజులుగా రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్టోగ్రతలతో.. సర్వాత్ర ఆందోళన రేగుతోంది. అయితే, నిపుణులు ఆందోళన పడినట్లుగానే.. రుతుపవనాల్లో మందగమనంతో ఉన్నాయని తేలింది. దీంతో రాష్ట్రంతో పాటు దక్షిణాదిలో తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాలపై వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. గడచిన నాలుగైదు రోజులుగా వర్షాభావ పరిస్థితులతో ఏపీలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో తీవ్రమైన వేడిమి, ఉక్కపోత పరిస్థితులు నెలకొన్నాయని భారత వాతావరణ విభాగం స్పష్టం చేసింది. అదే విధంగా ప్రస్తుతం ఈశాన్య, తూర్పు, ఉత్తర భారత్లోని చాలా చోట్ల మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నట్టు వెల్లడించింది. ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్లలో భారీ వర్షాలు నమోదు అవుతున్నాయి. మేఘాలయలోని మాసిన్రంలో అత్యధికంగా 30 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదు అయింది. ఈశాన్య రాష్ట్రాలపై నైరుతి రుతుపవనాలు అత్యంత క్రియాశీలకంగా మారటంతో భారీ వర్షాలు నమోదు అవుతున్నట్టు వాతావరణ శాఖ తెలియచేసింది.