ప్రజాప్రతినిధులపై కేసుల విచారణ వేగవంతంపై హైకోర్టులో విచారణ - AP HC hearing News
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 28, 2023, 6:58 PM IST
HC Hearing on Public Representatives Cases: ప్రజాప్రతినిధులపై కేసుల విచారణ వేగవంతం అంశంపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం (హైకోర్టు)లో విచారణ జరిగింది. విచారణలో భాగంగా ప్రజాప్రతినిధుల కేసుల విచారణపై నవంబర్ 9వ తేదీన దేశ అత్యున్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా సుమోటోగా ప్రజాహిత వ్యాజ్యానికి చర్యలు ప్రారంభిస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది. విచారణ పురోగతిపై విజయవాడ ప్రత్యేక కోర్టు పంపిన నివేదికను న్యాయస్థానం పరిశీలించింది. అనంతరం అడ్వకేట్ జనరల్ సూచనలను పరిగణలోకి తీసుకున్న హైకోర్ట్ ధర్మాసనం, మార్గదర్శకాలు జారీ చేస్తామని వెల్లడించింది.
HC Key Actions on Public Representatives Cases:ప్రజాప్రతినిధులపై కేసుల విచారణలో జాప్యం నివారణకు సంబంధించి డిసెంబర్ 08 2023న జరిగిన విచారణలో రాష్ట్ర హైకోర్టు కీలక చర్యలు ప్రారంభించింది. 'సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో వాటిపై విచారణకు సుమోటోగా ప్రజాహిత వ్యాజ్యాన్ని నమోదు చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌తో పాటు, ఎంపీ, ఎమ్మెల్యేలపై కేసులను విచారించే విజయవాడలోని ప్రత్యేక కోర్టును వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు తదితర ప్రజాప్రతినిధులపై కేసుల విచారణలలో జాప్యాన్ని నివారించేందుకు సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించాలని తెలిపింది. ఈ కేసుల పర్యవేక్షణకు హైకోర్టుల్లో ప్రత్యేక ధర్మాసనాలను ఏర్పాటు చేయాలని పేర్కొంది. ట్రయల్ కోర్టులు తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప, వాయిదాలు వేయకూడదు' అని హైకోర్ట్ స్పష్టం చేసింది.