Alaya silks: అవినాష్ గుప్తా ఆస్తుల్ని వేలం వేయాలి.. విజయవాడలో వస్త్ర వ్యాపారుల ధర్నా - ఆలయ సిల్క్స్
Alaya silks Vijayawada: విజయవాడలోని ఆలయ సిల్క్స్ వద్ద చేనేత వస్త్ర వ్యాపారులు ఆందోళన చేపట్టారు. అవినాష్ గుప్తా ఆస్తులు జప్తు చేసి తమ అప్పులు తీర్చాలని డిమాండ్ చేశారు. అవినాష్ గుప్తా ధర్మవరం వ్యాపారులను ఇటీవల బంధించి హింసలు పెట్టారు. దీనిపై గుప్తాను పోలీసులు అరెస్టు చేశారు. తవ్వే కొద్దీ అవినాష్ గుప్తా అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్, తెనాలి, విజయవాడ, ధర్మవరం, మంగళగిరి ప్రాంత వ్యాపారులను అవినాష్ గుప్తా మోసం చేశారు. అప్పు అడిగితే బెదిరింపులు, బంధించి, దండించడం గుప్తా నైజమని వ్యాపారస్తులు ఆరోపించారు. అవినాష్ గుప్తా ఆస్తులు స్వాధీనం చేసుకుని అప్పులు తీర్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలువురు వ్యాపారులు, వ్యాపార సంఘాల నాయకులు మాట్లాడుతూ 'ధర్మవరం వ్యాపారులను బంధించి హింసించినందుకు మేం నిరసన తెలుపుతున్నాం. మా వ్యాపారులకు రావాల్సిన డబ్బులను ఇప్పించాలని కోరుతున్నాం. అవినాష్‌ను అరెస్టు చేసినంత మాత్రాన మాకు న్యాయం జరగదు. ఆయన ఆస్తులను ప్రభుత్వం వేలం వేసి మా బాకీలు చెల్లించాలని కోరుతున్నాం' అని అన్నారు.