YSRCP MLA Mustafa: నేను అధికార పార్టీ ఎమ్మెల్యేనేనా..! గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా ఆవేదన - Guntur Municipal Council meeting news
Guntur East Constituency MLA Mustafa Fire: నేను అధికార పార్టీ ఎమ్మెల్యేనేనా..? 5వ డివిజన్‌లో లక్ష రూపాయలు వెచ్చించి కల్వర్టు నిర్మాణం చేపట్టమని అధికారులను అడిగి ఆరేడు మాసాలవుతోంది. ఇప్పటి వరకు కదలిక లేదు. ఎందుకండి ఇంకా నేను ఎమ్మెల్యేగా ఉండడం? అసలు నా పనులు చేయొద్దని మిమ్మల్ని ఎవరు అడ్డుకుంటున్నారు..? అధికార పార్టీలోనే ఉన్న నాకు ఈ కర్మేంటి..? అని శనివారం నిర్వహించిన గుంటూరు నగరపాలక కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే ముస్తఫా అధికారుల తీరుపై మరోసారి తన ఆవేదనను వెళ్లగక్కారు. పెండింగ్‌లో ఉన్న పనులను ఎప్పుడు పూర్తి చేస్తారో అధికారులు లిఖితపూర్వకంగా తెలపాలని.. అధికారులను ప్రశ్నించారు. నగరంలోని పలు అభివృద్ధి పనులపై కౌన్సిల్ సమావేశంలో మేయర్‌ను ఆయన ప్రశ్నించారు. పెండింగ్‌లో ఉన్న పనులు అలాగే మరుగున పడిపోతే రాబోయే ఎన్నికల్లో.. ప్రజల నుంచి ఓట్లు ఎలా అడుగుతామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల మాటలు నమ్మే పరిస్థితిలో నేను లేనని ఆయన అన్నారు. రూ.కోటి వెచ్చించి డివైడర్ కడతారు కానీ నేను అడిగిన రూ.లక్ష విలువైన పని చేయటానికి చేతులు రావటం లేదా? ఏం ఎలా కనిపిస్తున్నానంటూ.. మహిళా కార్పొరేటర్లు, మహిళా అధికారులు ఉన్నారనే విషయాన్ని మరిచిపోయి అసభ్య పదజాలాన్ని వాడారు. కల్వర్టు పని ఎందుకు చేయలేదో సంబంధిత ఏఈని పిలిపించి వివరణ ఇచ్చేవరకు సమావేశాన్ని ఆపేయాలని పట్టుపట్టారు. నెల రోజుల్లో ఆ పని పూర్తి చేయించే బాధ్యత తనదంటూ ఎస్‌ఈ భాస్కర్ తెలియజేయడంతో ఎమ్మెల్యే శాంతించారు.