Soil mafia in Mangalagiri: "పర్మిషన్ ఏం లేదండీ..! తవ్వుకోమని ఎమ్మెల్యే చెప్పారండీ" - మట్టి దందా
Soil mafia in Mangalagiri: ఇసుక దందాతో చెలరేగుతున్న అధికార పార్టీ నాయకులు.. మట్టిపైనా కన్నేశారు. ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరుపుతూ సొమ్ము చేసుకుంటున్నా అధికారులు చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో స్థానిక శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి అండదండలతో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. ఎమ్మెల్యే అనుమతి ఇచ్చారంటూ మట్టి దొంగలు ఇష్టాను సారంగా ప్రకృతి వనరులు దోచుకుంటున్నారు. మంగళగిరి మండలం ఆత్మకూరులో శ్మశానంలో మెరక పోసుకునేందుకు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అనుమతి ఇచ్చారంటూ రెండు సామాజిక వర్గాలకు చెందిన నాయకులు గత కొన్ని రోజులుగా ఇష్టాను సారంగా మట్టి తవ్వుతున్నారు. శ్మశానం పక్కనే ఉన్న ఆత్మకూరు చెరువులో శ్మశానం పేరుతో ఇప్పటివరకు సుమారు వెయ్యి ట్రాక్టర్లకు పైగా మట్టి తరలించారు. దాదాపు నెల రోజులుగా ఈ తతంగం జరుగుతున్నా అధికారులు ఎవరూ ఇటువైపు కన్నెత్తి చూడటం లేదు. నగర పాలక సంస్థ అధికారులు తాము ఎవరికీ మట్టి తవ్వుకునేందుకు అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. కేవలం ఎమ్మెల్యే చెప్పారనే సాకుతో వెయ్యి ట్రాక్టర్ల మట్టిని అక్రమార్కులు దోచుకెళ్లారు.