Heart operations in GGH: గుంటూరు ప్రభుత్వాసుత్రిలో మళ్లీ గుండె ఆపరేషన్లు: గోపాలకృష్ణ గోఖలే
Heart operations started again in Guntur GGH: రాష్ట్ర ప్రజలకు ప్రముఖ గుండె వైద్య నిపుణులు గోపాలకృష్ణ గోఖలే ఓ శుభవార్త చెప్పారు. గత నాలుగేళ్లుగా గుంటూరు జిల్లా ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో నిలిచిపోయిన గుండె సంబంధిత శస్త్ర చికిత్సలు మళ్లీ ప్రారంభమయ్యాయని ఆయన తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వ పరస్పర సహకారంతో నేటి నుంచి ఆసుపత్రిలో మళ్లీ గుండె ఆపరేషన్లు నిర్వహిస్తున్నామని గోపాలకృష్ణ గోఖలే వెల్లడించారు. అంతేకాదు, ఇకపై నిరంతరం ఆపరేషన్లు కొనసాగుతాయని ఆయన వెల్లడించారు.
జీజీహెచ్‌లో గుండె ఆపరేషన్లు పునఃప్రారంభం.. గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో ఈరోజు నుంచి గుండె సంబంధిత శస్త్ర చికిత్సలు మళ్లీ ప్రారంభమయ్యాయి. ప్రముఖ గుండె వైద్య నిపుణులు గోపాలకృష్ణ గోఖలే ఆధ్వర్యంలో ఈ శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నట్లు ఆయన స్వయంగా వెల్లడించారు. నాలుగేళ్ల తర్వాత జీజీహెచ్ (GGH)లో ఈ ప్రక్రియ పునఃప్రారంభం కావటం వల్ల ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు. గతంలో ఆపరేషన్ల నిర్వహణకు రాలేనని చెప్పిన గోపాలకృష్ణ గోఖలేను.. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తాజాగా ఒప్పించారు. ఈ క్రమంలో ప్రభుత్వ పరస్పర సహకారంతో మళ్లీ గుండె ఆపరేషన్లు నిర్వహిస్తున్నామని గోపాలకృష్ణ గోఖలే తెలిపారు. ఇకపై నిరంతరం ఆపరేషన్లు కొనసాగుతాయని ఆయన వెల్లడించారు.
ఇకపై గుండె మార్పిడి కూడా చేస్తాం.. ''కొవిడ్ కారణంగా, ఇతరత్రా కారణాల వల్ల జీజీహెచ్‌లో నాలుగేళ్లపాటు గుండె శస్త్ర చికిత్సలకు బ్రేక్ వచ్చింది. ఇక నుంచి ఈ పోగ్రామ్ నిరంతరంగా కొనసాగుతుందని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఉన్నతాధికారుల నుంచి సపోర్ట్‌తో కూడిన ఆదేశాలు వచ్చాయి. ఇక నుంచి ఇంతకు ముందులాగే గుండె ఆపరేషన్లు, గుండె మార్పిడిలు కూడా చేస్తాము. ఆసుపత్రిలో ఉన్న జూనియర్లకు గుండె శస్త్ర చికిత్సలపై శిక్షణ కూడా ఇస్తాను. కాబట్టి గుండె సమస్యలతో బాధపడుతున్న వారు జీజీహెచ్ సేవలను వినియోగించుకోవాలని కోరుతున్నాను.-''గోపాలకృష్ణ గోఖలే, గుండె వైద్య నిపుణులు