ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి - మా ఇళ్లను కాపాడండి! అన్నమయ్య జిల్లా గుంజన నది తీరం ప్రజలు - నరసరాంపేట గ్రామస్థుల గోడు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 10, 2023, 10:07 PM IST
|Updated : Dec 10, 2023, 10:20 PM IST
Gunjana River Floods Houses Washed Away: గుంజన నది వల్ల తమ ఇళ్లులన్ని కొట్టుకుపోతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం నరసరాంపేట గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో చిన్నగా ఉన్న నది మిగ్జాం తుపాను ప్రభావంతో కురిసిన వర్షాల కారణంగా వరద ఉద్ధృతితో విస్తరిస్తుందని, దీంతో నది ఆనుకుని నరసరాంపేట గ్రామం ఉండడంతో కోతకు గురై ఇళ్లులన్ని నదిలో కొట్టుకుపోతున్నాయని స్థానికులు వాపోతున్నారు.
People Fire on YCP Govt: అధికారుల అలసత్వానికి, రాజకీయ నాయకుల అసత్య మాటలకు తమ గ్రామం కనుమరుగయ్యేందుకు సిద్ధంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు 20 ఇళ్లకు పైగా నదిలోకి కలిసిపోయాయని, మరో 30 నుంచి 40 ఇల్లు నదిలోకి కలిసేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యేకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. రక్షణ గోడ కట్టి నది ఉద్ధృతిని తగ్గిస్తామని చెప్పినా కార్యరూపం దాల్చలేదన్నారు. అధికారులు వచ్చి కల్లబొల్లి మాటలు చెబుతున్నారే గాని శాశ్వత పరిష్కారం చేయలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నరసరాంపేటను నదిలోకి కలిసిపోకుండా రక్షణ గోడను కట్టించాలని డిమాండ్ చేశారు.