కేశవరంలో చల్లారని గ్రావెల్ రగడ - మూడో రోజూ టీడీపీ, జనసేన నేతలు అరెస్ట్ - AP Latest News
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 9, 2023, 9:48 PM IST
Gravel Mining in Kesavaram of Konaseema District :డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం కేశవరంలో గ్రావెల్ అక్రమ తవ్వకాల చిచ్చు రగులుతూనే ఉంది. ఇక్కడి మైనింగ్ ప్రాంతాన్ని.. కేశవరం నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ లీలా కృష్ణలు పరిశీలించడానికి బయలుదేరగా.. పోలీసులు వీరిని వరుసగా మూడో రోజు అక్కడికి వెళ్లకుండా అరెస్ట్ చేశారు. జోగేశ్వరరావును పోలీసులు బలవంతంగా అదుపులో తీసుకుని టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అదేవిధంగా లీలాకృష్ణను వల్లూరులోని తన ఇంటి వద్ద అదుపులోకి తీసుకుని అంగర పోలీస్ స్టేషన్ కు పోలీసులు తరలించారు.
మూడు రోజులుగా టీడీపీ, జనసేన నాయకులు కేశవరం కొండలో గ్రావెల్ తవ్వకాల పరిశీలనకు వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో నిత్యం వందల లారీల్లో గ్రావెల్ తరలిస్తున్నారని విమర్శించారు. గ్రావెల్‌ను ప్రైవేటు అవసరాలకు విక్రయించి కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారని టీడీపీ, జనసేన నాయకులు ఆరోపించారు. అధికార యంత్రాంగం అవినీతి చేసే వారిపై కాకుండా ప్రశ్నించే వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారని ఎమ్మెల్యే జోగేశ్వరరావు ఆరోపించారు. జోగేశ్వరరావును వరుసగా పోలీసులు మూడోరోజు అరెస్ట్ చేయగా.. జనసేన నాయకుడు లీలాకృష్ణను మూడు రోజుల్లో రెండుసార్లు అరెస్ట్ చేశారు.