Somireddy fire on Collectorate officers: పొలాల కోసమంటూ.. ప్రైవేటు లే అవుట్లకు మట్టి తరలిస్తున్నారు: సోమిరెడ్డి
TDP Leader Somireddy fire on Collectorate officers: బ్రిటిష్ కాలంలో కట్టించిన చెరువుల్లో అడ్డగోలుగా మట్టి తవ్వకాలు జరుగుతున్నా.. నెల్లూరు జిల్లా కలెక్టర్, ఇరిగేషన్ అధికారులు పట్టించుకోవటం లేదని తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతకొన్ని రోజులుగా నెల్లూరు జిల్లా వెంకటాచల మండలం కనుపూరు చెరువులో జరుగుతున్న మట్టి తవ్వకాలపై, గ్రావెల్ మాఫియా అక్రమాలపై నెల్లూరు కలెక్టరేట్‌లో జరుగుతున్న స్పందన కార్యక్రమంలో అధికారులను సోమిరెడ్డి నిలదీశారు.
మేము రైతులం..పంచ కట్టుకువచ్చాం..సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రైతుల పొలాల కోసమంటూ అనుమతి తీసుకొని, ప్రైవేటు లే అవుట్లకు మట్టి తరలిస్తున్నారని ఆగ్రహించారు. రైతులకు కనీసం సాగునీరు కూడా ఇవ్వకుండా మట్టి తరలింపునకే అధికారులు ప్రాధాన్యమిస్తున్నారని దుయ్యబట్టారు. తాజాగా కనపూరు ఆయకట్టు రైతులు.. జిల్లా కలెక్టర్‌కు తమ సమస్యను విన్నవించుకోవడానికి వస్తే.. 'ప్యాంట్లు వేసుకొచ్చిన మీరు రైతులే కాదు' అని కలెక్టర్ అనడం దారుణమని సోమిరెడ్డి మండిపడ్డారు. కలెక్టర్‌తో మాట్లాడేందుకే తాము ఈరోజు పంచ కట్టుకు వచ్చామన్నారు. లక్ష క్యూబిక్ మీటర్లకు అనుమతిస్తే, 15 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని ఎత్తేశారని అధికారులకు సోమిరెడ్డి వివరించారు. ''ఇష్టానుసారంగా చెరువు మట్టి తరలిస్తున్న పట్టించుకోరా..? సుప్రీంకోర్టు ఉత్తర్వులను కూడా పట్టించుకోకుండా చెరువు స్థలాల్లో పాట్లు వేసి అమ్మేస్తున్నారు. మంత్రి కాకాణి నియోజకవర్గంలోనే ఇదంతా జరుగుతున్నా పట్టీపట్టనట్లు వ్యవహరించడంలో అంతర్యమేమిటి..? రైతులతో కలిసి కనుపూరు చెరువును కాపాడుకుంటాం'' అంటూ కలెక్టర్ లేకపోవడంతో జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్‌కు సోమిరెడ్డి వినతిపత్రం అందజేశారు.