ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Nara_Lokesh_Yuvagalam_Padayatra

ETV Bharat / videos

Grand Welcome to Lokesh Yuvagalam: ఉత్సాహంగా లోకేశ్​ పాదయాత్ర.. అడుగడుగునా జన నీరాజనం.. - ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్న లోకేశ్

By

Published : Aug 20, 2023, 8:04 PM IST

Grand Welcome to Lokesh Yuvagalam: ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర అడుగడుగునా జన నీరాజనంతో నిదానంగా సాగుతోంది. పాదయాత్ర ప్రారంభించి రెండు గంటలు దాటినా ఇంకా 2కిలోమీటర్లు దూరం కూడా సాగలేదు. భారీగా రోడ్లుపైకి వచ్చిన బెజవాడ ప్రజలు పాదయాత్రకు సంఘీభావం తెలుపుతున్నారు. అపార్ట్​మెంట్​ల నుంచి పెద్దఎత్తున మహిళలు హారతులతో తరలివచ్చి స్వాగతం పలుకుతున్నారు. పటమట ఎన్టీఆర్ సర్కిల్ దాటేందుకే గంటకు పైగా సమయం పట్టింది. విజయవాడ ఎన్టీఆర్ సర్కిల్ జన జాతరను తలపించింది. యువగళం పాదయాత్రకు పటమట అంతటా ప్రజాభిమానం పోటెత్తింది. పాదయాత్రకు మద్దతు తెలిపేందుకు వేలాదిగా ప్రజలు ఇరువైపులా రోడ్డెక్కటంతో మచిలీపట్నం-హైదరాబాద్ జాతీయ రహదారి స్తంభించిపోయింది. యువనేతకు సంఘీభావంగా మహిళలు, యువత భారీగా రోడ్లపైకి వచ్చారు. తనను కలిసేందుకు వచ్చిన ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ లోకేశ్ వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. 

రోడ్డు డివైడర్లు, భవనాలపైకి ఎక్కి నగర ప్రజలు యువనేతకు అభివాదం చెబుతున్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎన్టీఆర్ విగ్రహం వద్ద నగర మహిళలు.. యువనేత లోకేశ్​ను కలిసి వినతిపత్రం సమర్పించారు. వైసీపీ పాలనలో మహిళలు న్యాయం కోసం రోడ్లపై పోరాడాల్సిన పరిస్థితులు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు పట్టపగలే రక్షణలేని పరిస్థితి నెలకొందని, చీకటిపడితే నగర శివార్లలో బ్లేడ్ బ్యాచ్​లు, గంజాయిబ్యాచ్​ల ఆగడాలు పెరిగిపోయాయని లోకేశ్​కు వివరించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడినవారిపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. 

తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక మహిళలకు రక్షణ కల్పించి, తప్పుడు కేసులను ఎత్తివేయాలని కోరారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక గతంలో ఎన్నడూ లేనివిధంగా మహిళలపై.. సైకోలు దాడులకు తెగబడుతున్నారని లోకేశ్ మండిపడ్డారు. అధికారంలోకి రాగానే మద్యనిషేధం చేస్తానని చెప్పిన సీఎం మాటతప్పి.. జె-బ్రాండ్ల మద్యాన్ని తెచ్చారని విమర్శించారు. దీంతోపాటు రాష్ట్రంలో వైసీపీ నేతల సారధ్యంలో గంజాయి విక్రయిస్తుండటంతో మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలపై దాడులు, అఘాయిత్యాలకు పాల్పడేవారిపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు. మహిళల వంక చూడాలంటే భయపడే విధంగా చట్టాలను కఠినంగా అమలుచేస్తామని హామీ ఇచ్చారు. మహిళలపై నమోదు చేసిన తప్పుడు కేసులను ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details