వైసీపీ ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో సర్పంచుల ఆత్మహత్యలు - లెనిన్‌బాబు - కర్నూలు తాజా వార్తలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 11, 2023, 1:46 PM IST
Gram Panchayat System In Completely Disabled YCP Government Rule: వైసీపీ పాలనలో గ్రామ పంచాయతీ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయిందని రాష్ట్ర సర్పంచుల సంఘం ఉపాధ్యక్షుడు లెనిన్‌బాబు అన్నారు. సర్పంచుల హక్కుల సాధనకు రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లా పత్తికొండలో జరిగిన నియోజకవర్గ స్థాయి గ్రామ సర్పంచుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధి లక్ష్యంతో గెలిచిన సర్పంచులు రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ చర్యలతో చిన్న సమస్యను కూడా పరిష్కరించలేని స్థితిలో ఉన్నట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న ప్రణాళిక నిధులను సైతం సర్పంచుల ప్రమేయం లేకుండా వైసీపీ ప్రభుత్వం నిధులు మళ్లిస్తుందని ఆయన ధ్వజమెత్తారు. ప్రజల సమస్యలను కూడా పరిష్కరించలేని దుస్థితి నెలకొంది. గ్రామంలో చేసిన అభివృద్ధి పనులకు నిధులు రాక అప్పుల పాలై రాష్ట్రవ్యాప్తంగా పలువురు సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్న దుర్భర పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. కడపలో జరిగే రాయలసీమ జిల్లాల సర్పంచుల సమర శంఖారావం కార్యక్రమంలో ప్రస్తుత సర్పంచులు, మాజీ సర్పంచులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు.