ఎన్ఆర్ఐ వైద్య కళాశాలలో గ్రాడ్యుయేషన్ డే.. మధుర స్మృతులను స్మరించుకున్న విద్యార్థులు
గుంటూరు జిల్లా మంగళగిరి పరిధి చినకాకానిలోని ఎన్ఆర్ఐ వైద్య విద్య కళాశాలలో సోమవారం గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. ఎన్ఆర్ఐ వైద్య కళాశాలలో 2017-2023 విద్యా సంవత్సరంలో వైద్య విద్య పూర్తి చేసిన 142 మంది విద్యార్థులకు సోమవారం రాత్రి డిగ్రీ పట్టాల ప్రదానోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులందరికీ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి బాబ్జి చేతుల మీదుగా డిగ్రీ పట్టాలు పంపిణీ చేశారు. సమాజంలో వైద్య వృత్తి చాలా పవిత్రమైనదని ఆయన అన్నారు. వృత్తి నిర్వహణలో మీ వద్దకు వచ్చే రోగులే మీకు అధ్యాపకులని, వారిని నిర్లక్ష్యం చేస్తే నేర్చుకోవడం ఆగిపోతుంది. మీ వద్దకు వచ్చే వారిని గౌరవించండి. ఎదుటి వారితో పాటు మీ తల్లిదండ్రులను గౌరవించడం కూడా నేర్చుకోండి. గౌరవ ప్రదమైన వైద్య వృత్తిలో ఉన్నందున సమాజం పట్ల ఎంతో బాధ్యతగా వ్యవహరించాలని ఆయన సూచించారు. భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చెప్పినట్టు లక్ష్యాన్ని నిర్ధేశించుకొని దానిని సాధించడానికి కృషి చేయాలని బాబ్జి తెలిపారు. విద్యార్థులు వారి మధుర స్మృతులను స్మరించుకున్నారు.