Whip Dharmasri: ప్రభుత్వ విప్ ధర్మశ్రీ నిర్వాకం.. నోర్ముయ్ అంటూ యువకుడిపై మండిపాటు - ఎమ్మెల్యే ధర్మశ్రీ గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమం
Government Whip Karanam Dharmasri Fired On Woman: వైఎస్సార్సీపీ కార్యకర్త చేతిలో మోసపోయామని ఎమ్మెల్యే దగ్గర మొరపెట్టుకోగా.. నాకు చెప్పి మోసపోయావా అంటూ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ధర్మశ్రీ ఓ నిరుద్యోగిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. అనకాపల్లి జిల్లా రావికమతంలో.. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ధర్మశ్రీ గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి తిరిగి గ్రామస్థుల సమస్యలను తెలుసుకుంటున్న సమయంలో.. ఓ మహిళ తన ఆవేదనను ఎమ్మెల్యే ముందుంచారు. ఉద్యోగం ఇప్పిస్తానంటే ఓ వైఎస్సార్సీపీ కార్యకర్తకు డబ్బులు చెల్లించినట్లు ఆమె ఎమ్మెల్యేకు వివరించారు. డబ్బులు తీసుకుని మోసం చేశారని.. ఉద్యోగం పేరుతో తన కుమారుడు మోసపోయాడని ఆమె తెలిపింది. ఇంతలో ఆమె కొడుకు డబ్బులు తీసుకుని ఉద్యోగం ఇవ్వలేదంటూ వాపోయారు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన ఎమ్మెల్యే 'నోర్ముయ్.. నువ్వు నాకు చెప్పి డబ్బులు ఇచ్చావా' అంటూ మండిపడ్డారు. అంతేకాకుండా నీ కుమారుడ్ని అదుపులో పెట్టుకో అని ఆ మహిళను హెచ్చరించారు.