5వ తేదీలోగా విధుల్లోకి రాకుంటే చర్యలు తప్పవు - అంగన్వాడీలకు ప్రభుత్వం హెచ్చరిక - anagnwadis strike stop
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 2, 2024, 5:19 PM IST
Government Notices to Anganwadis Stop the Strike: సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న అంగన్వాడీలను ఈ నెల 5వ తేదీలోగా విధులకు హాజరు కావాలని లేకుంటే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. విధులకు హాజరు కాకుంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. ప్రభుత్వ విజ్ఞప్తి పేరుతో జిల్లా కలెక్టర్ల చేత అంగన్వాడీలకు ప్రభుత్వం నోటీసులు జారీ చేయించింది. అంగన్వాడీల సమ్మె వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను ప్రభుత్వం నోటీసుల్లో వివరించింది. అంగన్వాడీలకు పూర్తి చేసిన హామీలను వివరిస్తూ నోట్ జారీ చేసింది.
తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు గత 22 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. అంగన్వాడీలపై అధికారులు బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారు. అంగన్వాడీలు మాత్రం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ దాదాపు 22 రోజులుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. వేతన పెంపు, ఉద్యోగ భద్రత కల్పించాలంటూ 22 రోజులుగా అంగన్వాడీలు ఆందోళనలు చేస్తున్నారు. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని ఇప్పటికే ప్రభుత్వానికి అంగన్వాడీలు తేల్చి చెప్పారు.