Gold Appraiser Cheating రక్షించాల్సినోడే.. దోచేశాడు! నకిలీ బంగారంతో లక్షల రూపాయలు కాజేసిన బ్యాంక్ అప్రైజర్..! - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 1, 2023, 1:18 PM IST
|Updated : Sep 1, 2023, 7:00 PM IST
Gold Appraiser Cheating : బంగారం నాణ్యత పరిశీలించే అప్రైజర్ బ్యాంకులో తనఖా బంగారంతో ఉడాయించిన ఘటన పల్నాడు జిల్లా యడ్లపాడు యూనియన్ బ్యాంకులో చోటు చేసుకుంది. యడ్లపాడుకు చెందిన నిడమానూరు హరీష్ స్థానిక యూనియన్ బ్యాంకులో గోల్డ్ అప్రైజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం బ్యాంకులో కుదువ పెట్టిన బంగారం సుమారు 304 గ్రాములు జమకాకపోవడం.. అదే రోజు మధ్యాహ్నం నుంచి హరీష్ బ్యాంకుకు రాకపోవటంతో బ్యాంకు సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. అనంతరం బంగారం పరిశీలనకు అధికారులతో ఆడిట్ నిర్వహించగా 30 ఖాతాల్లో హరీష్ వేర్వేరు బినామీ పేర్లతో నకిలీ బంగారం తాకట్టు పెట్టి 40 లక్షలు తీసుకున్నట్లు గుర్తించారు.
పూర్తిస్థాయిలో ఆడిట్ నిర్వహించి ఏమేరకు బ్యాంకును మోసగించారో నిర్ధారించుకుని పోలీసులకు సమాచారం ఇచ్చామని బ్యాంకు అధికారులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఖాతాదారులు బ్యాంకు వద్దకు పెద్దసంఖ్యలో చేరుకుని తమ బంగారం గురించి ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు వారికి సర్ది చెప్పి పంపించి వేశారు. బ్యాంకులో తాకట్టు పెట్టిన ఖాతాదారుల బంగారంకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ఖాతాదారులు ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజినల్ హెడ్ తెలిపారు.