Giddalur MLA Comments: సొంత పార్టీ నాయకులపై వైసీపీ ఎమ్మెల్యే అసహనం.. అసలేం జరిగిందంటే..! - గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు కామెంట్స్
Giddalur MLA Anna Rambabu Comments: ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు సొంత పార్టీ నాయకులపై అసహనం వ్యక్తం చేశారు. తాను రెడ్డి కులానికి వ్యతిరేకిననే ముద్ర వేసి.. సొంత పార్టీ వాళ్లే బురద చల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై చేస్తున్న అనవసరమైన ఆరోపణలతో రాజకీయాలలో ఉండాలా.. వద్దా అనే ఆలోచించుకునే పరిస్థితి వచ్చిందని అన్నారు. నిరంతరం ప్రజలలో ఉండి నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజల సమస్యలు తీర్చేందుకు కృషి చేస్తున్నానని తెలిపారు. అటువంటి తనపై బురదజల్లే కార్యక్రమం జరుగుతుందని వాపోయారు. పార్టీలో గ్రూప్ రాజకీయాలు.. పార్టీని దెబ్బతీస్తాయని అన్నారు. రోబోయే ఎన్నికల్లో పోటీ చేయాలా.. వద్దా అనే సంఘర్షణలో ఉన్నానని చెప్పారు. తప్పుకోవాలని తన మనసు చెబుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్తులు అమ్ముకొని ప్రజలకు మంచి చేస్తున్నా సరే.. తనపై చెడుగా ప్రచారం చేస్తున్నారని అన్నారు. తాను ఏ కులానికి వ్యతిరేకం కాదని పేర్కొన్నారు. ఏ కులానికి అయినా ద్రోహం చేసినట్లు నిరూపిస్తే.. ఎటువంటి శిక్షకైనా సిద్ధమని తెలిపారు. ప్రకాశం జిల్లాలోని కంభం పట్టణంలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్న వెంకట రాంబాబు ఈ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.