Appanna Garuda Seva సింహద్రి అప్పన్నకు వైభవంగా గరుడసేవ.. భారీగా తరలి వచ్చిన భక్తులు - అప్పన్నకు వైభవంగా గరుడసేవ
Garuda Seva at Simhachalam Temple in Visakhapatnam: విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న సన్నిధిలో స్వామివారికి వైభవంగా గరుడ సేవ నిర్వహించారు. స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి విశేష పూజలు నిర్వహించి అనంతరం గరుడ వాహనంపై ఊరేగించారు. మంత్ర పుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. స్వామి ఆర్జిత సేవలో భాగంగా నిత్య కళ్యాణం వైభవంగా నిర్వహించారు. సింహగిరి భక్తులతో రద్దీగా ఉంది. అలాగే గురువారం సింహాద్రి అప్పన్న స్వామి దేవాలయంలో నిత్య కల్యాణోత్సవం కమనీయంగా జరిగింది. అర్చకులు వేకువ జామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొలిపి ఆరాధన, బాలభోగం సేవలు జరిపారు. దేవేరుల సమేతుడైన స్వామిని శోభాయమానంగా అలంకరించి ఆలయ బేడా మండపంలోని వెండి సింహాసనంపై ఆశీనులను చేశారు. వేదమంత్రాలు, నాదస్వర మంగళవాయిద్యాల నడుమ దేవతామూర్తుల పరిణయ ఉత్సవాన్ని సంప్రదాయబద్ధంగా జరిపించారు. అర్చకులు భక్తులను ఆశీర్వదించి స్వామి వారి శేషవస్త్రాలు, కల్యాణ తలంబ్రాలు అందజేశారు.