వైసీపీలో మెుదలైన ముసలం - ఉదయం ఆళ్ల రామకృష్ణారెడ్డి, మధ్యాహ్నం దేవన్‌రెడ్డి వైసీపీకి రాజీనామా - వైసీపీ కి రాజీనామా
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 11, 2023, 8:17 PM IST
Gajuwaka YCP incharge Devan Reddy Resign to YCP: వైసీపీకి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన షాక్ నుంచి కొలుకునే లోపే విశాఖ నుంచి మరో షాక్ తగిలింది. వైసీపీ పార్టీ గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు, గాజువాక నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ దేవన్‌రెడ్డి రాజీనామా చేశారు. వయసు, అనారోగ్య సమస్యల రీత్యా వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు దేవన్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని తిప్పల నాగిరెడ్డి పార్టీ అధిష్ఠానాన్ని అడిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఆ టికెట్‌పై హామీ రాకపోవడంతో, దేవన్‌రెడ్డి వైసీపీ రాజీనామా చేశారు. నియోజకవర్గ ఈ బాధ్యతలను మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు అప్పగిస్తూ వైసీపీ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు.
దేవన్‌రెడ్డి రాజీనామా చేయడంతో అమర్నాథ్ నియమించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈరోజే గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే పదవికి, వైసీపీ పార్టీ సభ్యత్వానికి ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు. తాజాగా దేవన్‌రెడ్డి రాజీనామా చేయడం పార్టీలో కలకలం రేపుతుంది. అయితే, గాజువాక నియోజకవర్గం బీసీలకు కేటాయించారని, అందుకే తిప్పల దేవన్‌రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు తెలుస్తుంది.