వైభవంగా మారెమ్మ ఆలయ రథోత్సవం.. భారీగా తరలివచ్చిన భక్తులు - గుంతకల్లులో మారెమ్మ ఆలయంలో రథోత్సవం వేడుకలు
Maremma Temple Rathotsavam: అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని కథల వీధిలో వెలసిన సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం గద్దెరాళ్ల మారెమ్మ తల్లి దేవస్థానంలో రథోత్సవం కన్నుల పండువగా సాగింది. మారెమ్మ రథోత్సవం కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఉగాది ఉత్సవాలలో భాగంగా విద్యుత్ దీప కాంతులు, ప్రత్యేక పూలతో ఆలయ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆలయ మండపం నుంచి శ్రీ గద్దెరాళ్ల మారెమ్మ అవ్వ వారి ఉత్సవ మూర్తులను మేళతాళాల మధ్య తీసుకువచ్చిన ఆలయ అర్చకులు రథంపై కొలువుదీర్చారు.
వేద పండితులు గుంతకల్లు ఎమ్మెల్యే వై. వెంకట్రామిరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రథోత్సవాన్ని ప్రారంభించారు. మారెమ్మ నామస్మరణ మధ్య భక్తులు రథాన్ని లాగి తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ రథోత్సవ కార్యక్రమానికి అనంతపురం జిల్లా నుంచే కాకుండా చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. రథోత్సవంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.