మద్యం మత్తులో గొడవ.. స్నేహితుడిపై కత్తితో.. - ఎమ్మిగనూరు బైపాస్ సమీపంలో వ్యక్తి హత్య న్యూస్
Murder Under Influence of Alcohol: ఇటీవల కాలంలో మద్యానికి బానిసలుగా మారిన వ్యక్తులు అనేక నేరాలకు పాల్పడుతున్నారు. తాగిన మైకంలో ఏం చేస్తున్నారో వారికే తెలియట్లేదు. మత్తులో ఏం జరిగిందో తెలుసుకునేలోపే దారుణాలు జరిగిపోతున్నాయి. ఇదే రీతిలో కర్నూలు జిల్లా ఆదోనీలో ఓ ఘటన జరిగింది. శంకర్ అనే ఓ ఆటో డ్రైవర్‌ను మద్యం మత్తులో ఉన్న తన స్నేహితుడు దారుణంగా హత్య చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. ఎమ్మిగనూరు బైపాస్ సమీపంలో మండగిరికు చెందిన శంకర్(40) అనే వ్యక్తి.. తన నలుగురు స్నేహితులతో సోమవారం సాయంత్రం మద్యం సేవించాడు. అనంతరం మద్యం మత్తులో ఉన్న వీరంతా గొడవపడ్డారు. ఈ క్రమంలో వారిలో ఓ వ్యక్తి శంకర్‌ను కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన శంకర్‌ను స్థానికులు ఆదోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అతడిని కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా.. అతడు చికిత్స పొందుతూ హాస్పిటల్లో మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్ శంకర్‌ను తన స్నేహితుడు కత్తితో పొడిచిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్థానిక సీసీటీవీలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
TAGGED:
kurnool district latest news