Lightning strike: అంబేద్కర్ కోనసీమలో పిడుగులు.. నాలుగు కొబ్బరి చెట్లు దగ్ధం - పిడుగులు పడి నాలుగు కొబ్బరి చెట్లు దహనం వీడియో
Lightning strike: భానుడి ప్రతాపంతో రాష్ట్రంలోని ప్రజలంతా ఉక్కిరిబిక్కిరి అయిపోతుంటే.. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షంతో.. పిడుగులు పడి నాలుగు కొబ్బరి చెట్లు దహనమయ్యాయి. అంబాజీపేట మండలంలోని మాచవరం పంచాయతీ పరిధిలో చప్పిడివారి పాలెంలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. తన ఇంటికి సమీపంలోని కొబ్బరి చెట్లు పిడుగుపాటుకు గురై దహనమవ్వటాన్ని వెంకటేశ్వరరావు అనే ఓ స్థానిక వ్యక్తి గుర్తించాడు. ఈ ఘటన జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. ఆ సమయంలో పిడుగులు పడి కొబ్బరిచెట్లు దహనమయ్యాయి. కొబ్బరి చెట్లపై నుంచి నిప్పు రవ్వలు సమీపంలో ఇళ్లపై పడతాయేమోనని స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అంబాజీపేట మండలంలో శనివారం కనిష్టంగా 26.7 డిగ్రీల ఉష్ణోగ్రత, గరిష్టంగా 41.2 డిగ్రీల ఉష్టోగ్రతలు నమోదై.. సాయంత్రం సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడటంతో ఆ ప్రాంతంలో ఆయా చోట్ల పిడుగులు పడ్డాయి.